ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతి చరిత్రను, సంస్కృతిని, వైభవాన్ని వివిధ కోణాలలో ప్రతిబింబిస్తున్నది. ముద్రికలోని రెండు సర్పాలు తెలుగుజాతికి, వారి విజ్ఞానానికి సంకేతాలు. క్రీస్తు శకానికి కొన్ని శతాబ్దాల పూర్వం శాతవాహనుల కాలంలోనే తెలుగువారు నౌకానిర్మాణంలోను, నౌకాయానంలోను ప్రపంచ ప్రసిద్ధి పొందారు. ముద్రికలోని నౌక నైపుణ్యానికి చిహ్నం. 'అమరావతి పూర్ణ కుంభం' బౌద్ధ యుగంలో తెలుగువారి ప్రాభవాన్నీ, వరంగల్లు ద్వారం కాకతీయ యుగంలో తెలుగువారి వైభవాన్నీ తెలియజేస్తున్నాయి. దీనిలోని హంస క్షీరనీర న్యాయానికీ, భారతీయ తాత్త్విక చింతనలోని ఆత్మతత్త్వానికీ ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని హైదరాబాదు నగరం భారతదేశపు రేఖా చిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను, ఔన్నత్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. భారతదేశంలోనూ, ప్రపంచం నలుమూలలా తెలుగుజాతి విస్తరించి ఉన్నదనే భావాన్ని భూగోళరేఖా రూపం విశదీకరిస్తున్నది. అన్నింటినీ మించి భారత ప్రభుత్వపు త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీషు లిపులలో అక్షర రూపం దాల్చింది. ఈ అధికార ముద్రిక ప్రపంచ తెలుగు మహాసభల ఆశయాలకూ, విశిష్టతకూ సంకేతం.
మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏప్రిల్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హైదరాబాదు లాల్‌బహుదూర్ స్టేడియంలో జరిగాయి.
రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు 1981 ఏప్రిల్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగాయి.
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 1990 డిశంబర్ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మారిషస్‌లో జరిగాయి.